Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

నేను అనగా ఏమి?

ఈ విశాలమైన ప్రపంచంలో కోట్లకొలది ప్రాణులున్నవి. ప్రతిప్రాణి హృదయంలోనూ 'నేను' 'నేను' అనే భావం స్ఫురిస్తూ వుంటుంది. ప్రతివ్యక్తికీ ఇట్లు ప్రత్యేకంగా స్ఫురణ కలుగుటలో అర్థ మేమి? మానవులకు కలిగినఉత్తమ భావములకే వేదమనిపేరు. వేదముల తుదిని వేదాంత మని అంటారు. వేదాంతములోనూ, ఈ నేను గూర్చియేఎక్కువగా విచారము చేయబడింది. ఈ 'నేను' అను స్ఫురణకు అర్థమేమో కొంచెం వివరిద్దాం.

వేదములలో మొదటిది ఋగ్వేదం. దాని అంత్య భాగమే ఐతరేయ బ్రహ్మణము. దానిలో ప్రతిమానవుడూ ఈ 'నేను' అనగా ఏమో తెలుసుకోవాలని చెప్పబడింది. వేదకాలంలో మహామహులు దీనిని గూర్చి చేసిన విచారణ దీని వలన తెలియుచున్నది. మనం ఎన్నో పనులు చేస్తున్నాము? ఈ అనవరత కార్యప్రపంచం ఎవరి కొరకు? మన మెంత చదివినా, ఎంత సంపాదించినా, ఎన్ని ఊళ్ళకు వెళ్ళినా, ఏ అకార్యము చేసినా, అన్నీ ఈ 'నేను'ను ఉద్దేశించేకదా! ఈ 'నేను' అనగా నేమి? ఎవరో చెప్పినది వింటే మనకేమి ప్రయోజనం? మనం దీనిని గూర్చి ఆలోచించాలి. మరి గీత 'ఉద్ధరేత్‌ ఆత్మనాత్మానం' అనికదా చెప్పినది? రోగ మున్న వాడు మందు పుచ్చుకోవాలి కాని ఎవరో మందు తీసుకొంటే రోగికి రోగం నివారిస్తుందా? ఆత్మవిద్య అనుభవంలో మనకు రావాలి. పూర్వకాలములో ఎవరో సాక్షాత్కారము చేసుకొన్నారని మనం కూరుచుంటే ప్రయోజనం లేదు. ఈ విషయం గూర్చి మనము కూడ విచారణ చేయాలి.

ఒక వస్తువు యొక్క వాస్తవస్థితి తెలిసేటంతవరకూ బుద్ధి అల్లాడుతూనే వుంటుంది. ఎందువల్ల? 'బుద్ధిః వాస్తవ పక్షపాతినీ' అని అన్నారు. నిజం తెలిస్తేకాని బుద్ధి. శాంతించదు. బుద్ధికి సత్యముపై పక్షపాత మని ప్రాచీనుల వాక్కు. ఇతరుల ప్రమేయమూ, ఉపదేశమూ లేకుండానే 'నేను నేను'అనే స్ఫురణ కలుగుతున్నది. ఈ నేను అనగా నేమి?

క్రైస్తవ సిద్ధాంతము ''జీవుడనే నిత్యవస్తు వొకటి వున్నది. ఆ వస్తువు మానవులలోనేకాని, పశుపక్ష్యాదికములలో లేదు. మానవుని దేహము నశించినా, జీవునికినాశము లేతు. మానవుడు చనిపోయిన పిదపకూడ ఖననము చేసిన చోట జీవుడుండును. ప్రళయకాలములోభగవంతుడుజీవులకు సుకృత దుష్కృత ఫలముల నిస్తున్నాడు'' అని చెప్పుతుంది. ఇది వారి సిద్ధాంతము.

రామానుజాచార్యులవారు వైష్ణవమతం విశిష్ఠాద్వైత మతాన్ని స్థాపించారు. వారు మహానుభావులు. ఎన్నో గ్రంధాలు వ్రాశారు. చేసిన ఘనకార్యము లెన్నో. వారి ఆనుయాయులు లక్షసంఖ్యలో ఉన్నారు- సంపూర్ణమైన వస్తు వొకటి ఉన్నది. అది అనేకాంశలు కలది. ఈ నేను ఆ అంశలలో ఒకటే కాని అన్యముకాదు. జీవు లందరూ జడులే. కాని ప్రతిజీవిలోనూ ఆ పరిపూర్ణమైన వస్తువు అంతర్యామిగా నున్నది. ఇది రామానుజ మతము.

ఉపనిషత్తులు, ప్రపంచ మందలి సర్వవస్తువులకూ ఒక మూలకారణం ఉన్నదని చెబుతున్నవి. కుండకు మట్టి ఎట్లు ఆధారమో సర్వ ప్రపంచమునకూ ఆధారమైన ఒక మూల వస్తువు ఉన్నది. ఆ వస్తువే ప్రతిమనిషి దేహంలోనూ కలదు. నేను అనే స్ఫురణకు కారణం ఆ వస్తువే. దానినే జ్ఞాన మని కూడ అంటారు. అన్ని వస్తువులూ, దానిచేత తెలియబడునే కాని, దానిని తెలుసుకొనే వస్తువు వేరేలేదు. ఆ వస్తువు కేవలము జ్ఞానమేకాదు- ఆనంద స్వరూపముగానూ ఉన్న దనుటే ఉపనిషణ్మతము.

ఆనంద మనగా నేమి? కంటికి ఇంపైన వస్తువును మనం చూస్తున్నాం. చెవికి ఇంపైన శబ్దాన్ని వింటున్నాం. సుగంధమును ఆఘ్రాణిస్తున్నాం. ఈ ఇంద్రియ వ్యాపారం వల్ల ఏదో ఒక ఆనందానుభూతి కలుగుతూవుంది. ఈ సంతోషానికి అర్థమేమి? ఈ ఆనందం ఆగంతుకమా? లేక చిత్తవృత్తి విశేషం వలన స్ఫురిస్తున్నదా? అని విచారించినపుడు ఈ శక్తి సహజ శక్తియే అని గోచరిస్తున్నది. ఈ సంపూర్ణముగా వున్న ఆనందమే ఖండఖండముగానూ అవగతమౌతున్నది. వ్యాకరణ శాస్త్రములో స్ఫోటవాదమని ఒక వాదమున్నది. మాక్స్‌ముల్లరు వ్యాకరణశాస్త్ర మొక ా-|n-| అని చెప్పాడు. కొన్ని నిరుక్త పదములను, కొన్ని వేద శబ్దములనూ అనుసరించి ఆయన ఫైలాలజి అనే శాస్త్రమొకటి తయారుచేశాడు. అటువంటి వ్యాకరణశాస్త్రంలో శబ్దమే బ్రహ్మమని చెప్పబడింది. ఈ క, గ, చ, జ అనే వర్ణములన్నీ నాలుక, పెదవులు, దవడ, కంఠము, నాసిక మొదలైన అవయవ సంబంధమువలన, వాయువు యొక్క అభిఘాతము వలన కలుగుతున్నవి.

ఒక చిన్న రంధ్రములో నుంచి సూర్యరశ్మి ఇంటిలోనికి వస్తుంది. ఆ రంధ్రము వర్తులాకారమైతే ఎండకూడ వర్తులా కారంగానే వుంటుంది. ఆ రంధ్రము చతురస్రమో, దీర్ఘ చతురస్రమో అయితే ఎండకూడ తదాకారి ఔతుంది. అనగా ఉపాధినిబట్టి రూపము ఏర్పడుతున్న దన్నమాట. శబ్దబ్రహ్మము కూడా పరిపూర్ణంగా, అఖండముగా నున్నది. తాలవ్యా ద్యభిఘాత విశేషమువల్ల; నానావిధములైన నాదములు శ్రవణంద్రియములకు విషయము లగుతున్నవి. వేదాంతులు దీనినే సత్కార్యవాద మని అంటారు.

ఎవరైనా భక్తిరస, ప్లావితములైన గీతికలను పాడుతుంటే, మనము పులకాంకితుల మౌతుంటాము. మన హృదయాలలో ఆనందానుభూతి కలుగుతుంది. ఈ ఆనందము మన హృదయాలలో ఇంతకుముందే వున్నదా? లేక ఆగంతుకమా? అని మనం విచారించి నట్లైతే, మనలో ఉండే అఖండానందాన్నే ఖండఖండములుగా అనుభవిస్తున్నామనీ, ఇది ఎక్కడ నుండియో రావటములేదని మనకు తెలుస్తుంది. అ నేను ఆనందఘనము, కాని దాని కొక అవరకమున్నది. అది కొంచెము తొలగినపుడే ఆనందస్ఫురణ కలుగుతున్నది. ఈ విషయాన్నే శంకరులవారు దక్షిణామూర్తి స్తోత్రంలో యిలా వ్రాశారు.

నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం

జ్ఞానం యస్య తు చక్షుదాది కరణద్వారా బహిః స్పందతే|

జానామీతి తమేవ భాంత మనుభా త్యేత త్సమస్తం జగత్‌

తసై#్మ శ్రీ గురుమూర్తయే నమ ఇదం.

- శ్రీ దక్షిణామూర్తయే ||

జ్ఞానము దీపశిఖతో సమానము. దీపముంటే చీకటిలో వస్తువులను చూడగలం. జ్ఞానదీపము వలన ప్రపంచమంతా మన ఎరుకకు వస్తుంది. ఆ నేను అనునది పరిపూర్ణజ్ఞాన స్వరూపం. అది ఆనందఘనం. దానికి మనస్సు అవరకముగా నున్నది.

రంధ్రములున్న కుండలో ఒక దీపముంచి రంధ్రములను గుడ్డతో కప్పితే దీపపుకాంతి అగపడదు. గుడ్డను కొంచెము తొలగించితే ప్రకాశము నేత్రగోచర మౌతుంది. దేహమున్నూ ఇలాంటి ఘటమే ఇంద్రియములే రంధ్రములు. ఆజ్ఞానమే ఆచ్ఛాదించే వస్త్రము. అజ్ఞానము తొలగిందంటే ఆనందమే. మనకు కనపడే సూర్యచంద్ర నక్షత్రగ్రహములు అన్నీ దాని రూపములే.

జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్‌ |

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

అని హయగ్రీవస్తోత్రము భగవంతుణ్ణి జ్ఞానానంద మయునిగా చెప్పింది. అనాత్మ విషయమైన ప్రపంచమును వదిలితే మిగిలేది శుద్ధమైన ఆత్మవస్తువే. అదియే నేను మనము తెలుసుకోవలసినది ఆ 'నేనే'.


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page